దిన దిన ప్రవర్ధమానంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు నేటితో 33 వసంతాలు పూర్తి

in tirumala •  6 years ago 

live.Tirupati Balaji Temple.jpg

దిన దిన ప్రవర్ధమానంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు

నేటితో 33 వసంతాలు పూర్తి

భక్తుల విరాళాలతో రూ.937 కోట్ల డిపాజిట్లు

శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టు దినదిన ప్రవర్ధమానమవుతూ 33 వసంతాలు పూర్తి చేసుకుంది. రోజుకు రెండు వేల మంది భక్తులతో అన్నప్రసాద వితరణను ప్రారంభించగా, ప్రస్తుతం తిరుమల, తిరుపతిలో కలిపి సరాసరి రోజుకు లక్షా 50 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీపోల భాస్కర్‌ పర్యవేక్షణలో ఈ ట్రస్టు విజయవంతంగా నడుస్తోంది. మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ ట్రస్టుకు రూ.937 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు ఉచితంగా భోజనం అందించాలనే సత్సంకల్పంతో టిటిడి 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా ప్రారంభించింది. ఆ తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు.

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్లు, పిఎసి-2, కాలినడక మార్గంలోని గాలిగోపురం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, 2వ సత్రం, 3వ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని రాంభగీచ బస్టాండు, సిఆర్‌వో, పిఏసి-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ప్రతి మూడు గంటలకోసారి అన్నప్రసాదం అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, దివ్యదర్శనం కాంప్లెక్స్‌, సర్వదర్శనం కాంప్లెక్స్‌, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌, ప్రధాన కల్యాణకట్టలో టి, కాఫి, చంటిపిల్లలకు పాలు అందించేందుకు రోజుకు 10 వేల లీటర్ల పాలను కొనుగోలుచేస్తున్నారు.

ప్రముఖ దినాల్లో 2 లక్షల మందికిపైగా :

తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవ రోజున 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం :

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, వర్మిసెల్లి ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5 నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 10 నుండి 12 టన్నుల బియ్యం, 6.5 నుండి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.

భక్తుల విరాళాలు :

శ్రీవేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు భక్తులు విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. మార్చి నెలాఖరుకు వరకు ట్రస్టుకు సంబంధించి రూ.937 కోట్లు పలు జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి. 2013-14 నాటికి రూ.507.05 కోట్లు, 2014-15 నాటికి రూ.592.23 కోట్లు, 2015-16 నాటికి రూ.693.91 కోట్లు, 2016-17 నాటికి రూ.809.82 కోట్లు, 2017-18 మార్చి నెలాఖరు నాటికి విరాళాలు రూ.937 కోట్లకు చేరాయి.

ఈ ట్రస్టుతోపాటు అన్నప్రసాద వితరణ కార్యకలాపాలను ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, తిరుమల క్యాటరింగ్‌ అధికారి శ్రీ జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి, తిరుపతి క్యాటరింగ్‌ అధికారి శ్రీ టి.దేశయ్య పర్యవేక్షిస్తున్నారు.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

Hi! I am a robot. I just upvoted you! I found similar content that readers might be interested in:
http://news.tirumala.org/new-annadanam-complex-renamed-as-annaprasada-bhavan/